కేజీహెచ్ కథలు
బహుముఖ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు మనల్ని ఎల్లప్పుడూ అబ్బురపరుస్తూ ఉంటారు. డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ఆ కోవకు చెందినవారు. గాయకుడు, చిత్రకారుడు, సైక్రియాటిస్ట్ అన్నింటికీ మించి మంచి రచయిత. ఆస్ట్రేలియా లో ఉంటూ, బిజీగా ఉన్నప్పటికీ తెలుగు భాష అన్న, తెలుగు రాతలు అన్న చాలా మక్కువ. మన గుండె చప్పుడు వినే డాక్టరు, మన నాడీ తెలిసిన డాక్టర్ మనసు మాటున దాగి ఉన్న ఉద్వేగాలు, అనుభవాలు, పరిశీలనలు తన ఈ తొలి పుస్తక రూపంలో దొరకటం సాహిత్య ప్రేమికులకు కిక్కు నిచ్చే టానిక్. ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం యాస పరిమళం నిండిన రచనలు చివర దాకా చదివిస్తాయి. నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి.మంచి రచనలు కొరవడిన ఈ రోజులలో, ఈ కేజీహెచ్ కథలు మండువేసవి లో తాటి ముంజెల లాగా మళ్ళీ మనల్ని ఉత్సహపరుస్తాయి. మరిన్ని పుస్తకాలు ఈ రచయిత నుండి రావాలనే ఆశ కల్పిస్తాయి. తన ఈ తొలి రచన విజయవంతమై , మరిన్ని కీర్తి కిరీటాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ…..
మణిబాబు వజ్జ
You can get your copy here.
KGH Kathalu by
Dr. Srikanth Miriyala
కింగ్ జార్జి ఆసుపత్రి, కేజీహెచ్‌గా మనందరికీ పరిచయం. పదకొండేళ్ల వయసులో మొదటిసారి నన్ను విశాఖ సముద్ర తీరానికి తీసుకెళ్తూ మా మేనమామ ఈ ఆసుపత్రిని చూపించారు. ఆ మరుసటి ఏడాది మా నాన్నగారు మళ్ళీ ఈ ఆసుపత్రి చూపిస్తూ, ‘ఇక్కడ చదివిన మన ఊరివాళ్ళు గొప్ప వైద్యులయ్యారు, అలాగే నువ్వు కూడా ఇక్కడే చదువుకోవాలనుంది’ అని చెప్పారు.
వందేళ్ళ చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రాణదాయినిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో నేను తొలుత వైద్య విద్యార్థిగా, తరువాత వైద్యుడిగా, అంతేకాకుండా నేనూ ఒక రోగిగా, నా కుటుంబ సభ్యులు కొంతమంది ఇక్కడ రోగులుగా చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళకి సేవకుడిగా, చివరగా ఇదే ఆసుపత్రి ఎదురుగా ఒక క్లినిక్ పెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఎన్నో జ్ఞాపకాలను పదిలపరుచుకున్నాను. ఇవన్నీ కేజీహెచ్తో ఎనలేని బంధాన్ని నెలకొల్పితే, నేను రాసుకున్న కథల్లో అప్రయత్నంగానో లేక నేనెప్పుడూ ఈ పరిసర ప్రాంతాలు దాటి ఆలోచించకపోవటం వల్లనో ప్రతి కథలో కేజీహెచ్ ఒక నేపథ్యంగా మారింది. అందుకని నా ఈ మొదటి కథాసంపుటికి ‘కేజీహెచ్ కథలు’ అని పేరు పెట్టాను.
ఇన్నేళ్ళలో ఇక్కడ నేను ఎంతో మంది రోగుల్ని, వాళ్ళ రోగాల్ని, బాధల్ని, కన్నీళ్ళని చూశాను. నయమైన వారి ఆనందాన్ని కూడా చూసాను. ఇక్కడే వైద్యం నేర్చుకున్నాను, వైద్యం చేశాను. ఈ క్రమంలో ఎన్నో అనుభవాలు పోగేసుకున్నాను. వాటన్నింటికీ అక్షరరూపం ఇవ్వలేకపోయినా కొన్ని మాత్రం రాసి ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను.
సాహితీ ప్రేమికులందరూ నా మొదటి పుస్తకాన్ని చదివి ఆదరిస్తారని ఆశిస్తూ..
-మిర్యాల శ్రీకాంత్